Loading...

యాజలి ZPHS పూర్వ గ్రేడ్–1 తెలుగు పండిట్ బృందావనం రామ కృష్ణమాచార్యులు కన్నుమూత

యాజలి పరిసర గ్రామాల పూర్వ విద్యార్థులకు, తెలుగు సాహిత్య ప్రేమికులకు, వేలాది మందికి తీవ్ర శోకాన్ని మిగిల్చుతూ యాజలి ZPHS పూర్వ గ్రేడ్–1 తెలుగు పండిట్ బృందావనం రామ కృష్ణమాచార్యులు గారు కన్ను మూశారు. ఆదర్శ గురువుగా, విలువలతో కూడిన బోధనకు ప్రతీకగా నిలిచిన ఈ మహనీయుడు గురువులలో గురువుగా ప్రసిద్ధి చెందారు. నియమ, నిబంధనలు తప్పని గురువుగా మరియు చాలా నిక్కచ్చిగా ఉండేవారు. తెలుగు మాస్టారు అంటే… "ఆయన బోధించిన సంధులు, సమాసాలు, తెలుగు పద్యాలు మరియు గణాలు ప్రతి ఒక్కరి మనసులో మెదులుతాయి”. 

తన అధ్యాపక జీవితమంతా విద్యార్థుల్లో విద్యపై ఆసక్తి, శ్రద్ధ, సంస్కారం పెంపొందించడంలో ఆయన చూపిన సేవ అమూల్యం. ఆయన బోధించిన విద్యార్థుల్లో అనేక మంది నేడు ఉన్నత శిఖరాలు అధిరోహించడం ఆయన గురుత్వ మహిమాన్వితతకు నిదర్శనం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఉత్తమ తెలుగు ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న రామ కృష్ణమాచార్యులు గారు, పాఠ్యపుస్తకాలు చూడకుండా సాఫీగా, శ్రద్ధగా పాఠాలు చెబుతూ ఆలోచనలను నిర్మించే అరుదైన ప్రతిభాశాలి. ఆయన ఇచ్చిన నోట్స్, ఆయన చెప్పిన కథలు, ఆయన బోధించిన విలువలు విద్యార్థుల హృదయాలలో నిలిచిపోయాయి.

ముప్పై ఏళ్ల క్రితం యాజలిలో ఆయన నాటిన మర్రిచెట్టు ఈ రోజుకి దృఢంగా నిలబడి ఉంది. పర్యావరణ పరిరక్షణ, చెట్ల ప్రాధాన్యం గురించి ఆయన అప్పటినుంచే విద్యార్థులకు అవగాహన కల్పించారు. మర్రి ఊడలు దించి చెట్టును బలపరిచినట్టు, విద్యార్థుల జీవితాలకూ పునాది ఆయనే వేశారు.

శాస్త్రాలు, ఉపనిషత్తులు, సంస్కృతం పై ఆయనకున్న లోతైన జ్ఞానం అమోఘం, మంత్రోచ్ఛారణలో నైపుణ్యం, కథ చెప్పే తీరులో ఆకర్షణ—ఇవి ఆయన తరగతి గదిని ఒక ఆధ్యాత్మిక–సాహిత్య ప్రపంచంగా మార్చేవి.

తన బోధనలో ప్రతి పాఠానికి భవిష్యత్తులో ఉపయోగం ఏమిటి? అనే దానిపై స్పష్టమైన దారి చూపుతూ ఆయన ఎన్నో తరాలకు మార్గదర్శకుడయ్యారు.

ఇలాంటి మహోన్నత ఉపాధ్యాయుడిని కోల్పోవడం విద్యా రంగానికే కాదు, ఆయన్ని గురువుగా భావించిన ప్రతీ శిష్యునికీ తీరని లోటు.

అయన ఆత్మకు శాంతి చేకూరాలి అని,  కుటుంబ సభ్యులకు, అభిమానులకు,  తెలుగు సాహిత్య  ప్రియులకు మా ప్రగాఢ సానుభూతి.

అశ్రునయనాలతో  ...............

----> శివ పల్లప్రోలు <------